ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం

ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం మొదలుకానుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి. భారత్‌లో తెలంగాణ విలీనమై 74 ఏళ్లు పూర్తయ్యి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణ, పోడుభూముల సమస్య పరిష్కారం తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశమున్నట్టు సమాచారం.

కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా తెలంగాణపై ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో అదనపు వనరుల సమీకరణపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. మహిళా యూనివర్సిటీ, సాగునీటి పారుదల రంగానికి చెందిన అంశాలు, ఉద్యోగులకు డీఏ పెంపు తదితర అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖకు సంబంధించి గతంలో చేసిన భూ కేటాయింపులకు ఆమోదం, మలక్‌పేటలో సచివాలయ ఉద్యోగుల క్వార్టర్స్ స్థలాన్ని ఐటీ హబ్‌కు కేటాయించే అంశం, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, వీటితో పాటు మునుగోడు ఉపఎన్నిక అంశం కూడా చర్చించే అవకాశం ఉంది.