ఎల్లుండి బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం

ఈ నెల 10 న బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరగబోతుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారని సమాచారం. ముఖ్యంగా ఈడీ విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నెల 11న ఈడీ ఎదుట ఎమ్మెల్సీ కవిత హాజరుకానుంది. ఇక.. ఈ నెల 10న జంతర్‌మంతర్‌ వద్ద కవిత దీక్షకు దిగనున్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కవిత దీక్ష చేయనున్నారు. అదే రోజు కేసీఆర్ సమావేశం ఏర్పటు చేయడం ఆసక్తి గా మారింది.

ఈ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ పార్లమెంట్‌ సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీఎంఎస్‌, డీసీసీబీ చైర్మన్‌లు పాల్గొననున్నారు. ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలు, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.