నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్న తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ..నేడు అసెంబ్లీ లో తొలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతోంది. లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ప్రవేశ పెడుతున్న ఈ బడ్జెట్ జనాలను ఎంత వరకు మెప్పిస్తుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓటర్లను మెప్పించేలా కీలక ప్రకటనలు వెలువడే అవశాకం ఉండొచ్చా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉదయం 9గంటలకు రాష్ట్ర కాబినెట్ సమావేశం కానుంది.
అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ వన్ లో క్యాబినెట్ భేటి కానుంది.దీనిలో బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.

దాదాపు 2.72 లక్షల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి మూడు నెలల కాలానికే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇవాళ బడ్జెట్ మధ్యాహ్నం 12 గంటలకు మధ్యంతర బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క చదవనున్నారు. మరోవైపు శాసన మండలిలో దుద్దిళ్ళ శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే ఈసారి బడ్జెట్‌లో కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయని..కొత్త ప్రతిపాదనలు ఉండవని చెబుతున్నారు.

ఇక కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే.. దాదాపు రూ.60వేల కోట్లకు పైగా అవసరం అవుతాయని అంచనా. ఈ నేపథ్యంలోనే సంక్షేమ, వ్యవసాయ, విద్యుత్ రంగాలకు కేటాయింపులు పెరగనున్నాయి. మహిళలకు ప్రతి నెల రూ.2500 అమలుకు రూ.20వేల కోట్లు సంబంధిత శాఖ అడిగిందట. 200యూనిట్ల ఫ్రీ కరెంట్కు రూ.4,200కోట్లు, ఉచిత ప్రయాణానికి రూ.5వేల కోట్లు కావాల్సి ఉంది. ఇలా గ్యారంటీల అమలుకు భారీగా నిధులు అవసరం కానున్నాయి.