కుప్పకూలిన మిగ్‌ -21 జెట్‌ విమానం ..ఇద్దరు పైలెట్లు మృతి

IAF’s MiG-21 trainer aircraft crashes in Rajasthan

రాజస్థాన్ ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. శిక్షణలో భాగంగా రాజస్థాన్‌లోని ఉతర్లె ఎయిర్‌ బేస్‌ నుండి బయలుదేరిన మిగ్‌ -21 జెట్‌ రాత్రి 9.10 గంటల సమయంలో బార్మర్‌ సమీపంలో ప్రమాదానికి గురైందని, ఇద్దరు పైలెట్లు మృతిచెందారని వైమానిక దళం (ఐఎఎఫ్‌) ఒక ప్రకటనలో తెలిపింది. పైలెట్ల మృతికి సంతాపం తెలుపుతున్నట్లు ఐఎఎఫ్‌ పేర్కొంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది.

ఇక గత ఏడాది ఐదు MiG-21 విమానాలు భారతదేశంలో కూలిపోయాయి. ఫలితంగా ముగ్గురు పైలట్లు మరణించారు. మార్చిలో, మధ్య భారతదేశంలోని ఎయిర్‌బేస్‌లో MiG-21 విమానానికి సంబంధించిన ప్రమాదంలో IAF గ్రూప్ కెప్టెన్ మరణించాడు. ఈ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ ఎ గుప్తా మృతి చెందాడు.

ఆగస్టులో, రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని ఒక గ్రామ సమీపంలో శిక్షణలో ఉన్న మరో మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయింది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. పంజాబ్‌లోని మోగా సమీపంలో ఆ ఏడాది మేలో జరిగిన ఇలాంటి ఘటనే పైలట్‌ను బలితీసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు IAF విమానం సాధారణ శిక్షణలో ఉంది. డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో శిక్షణ సమయంలో మిగ్-21 యుద్ధ విమానం కూలిపోవడంతో ఐఏఎఫ్ పైలట్ వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మరణించారు.