అయోధ్య ఆలయంపై నేడు లోక్సభలో చర్చ

లోక్ సభ లో ఈరోజు అయోధ్య రామ మందిరంపై చర్చ జరగనుంది. బీజేపీ సీనియర్ నేత సత్యపాల్ సింగ్ రామ మందిర నిర్మాణం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై చర్చను ప్రారంభిస్తారు. చర్చ సందర్భంగా అధికార పక్ష సభ్యులు ప్రధాని మోడీని ప్రశంసించే అవకాశం ఉంది. రామమందిరంపై చర్చ నేపథ్యంలో తమ సభ్యులు నేడు సభకు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. అటు ఇవాల్టితో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.

ఇక జనవరి 22 న అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వైభవంగా జరిగింది. రామనామ స్మరణతో అయోధ్య మార్మోగింది. అభిజిత్ లగ్నం ముహూర్తంలో బాలరాముడి ప్రతిష్ఠ జరిగింది. రామయ్య దర్శనంతో ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ గవర్నర్ ఆనంద్ బెన్, ఆ రాష్ట్ర సీఎం యోగి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు పాల్గొన్నారు. యావత్ దేశం రామయ్య సుందర రూపం చూసి తన్మయత్వానికి గురైంది. జయహో రామచంద్రా.. జయజయహో రామచంద్రా అంటూ అంజలి ఘటించింది.