సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, హుక్కా పార్లర్లపై నిషేధం..అసెంబ్లీ ఆమోదం

telangana-assembly-unanimously-approves-ban-on-hookah-parlours-bill

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రంలో మత్తు పదార్థాల విక్రయం, సరఫరాపై సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా వాటి కట్టడికి నిరంతరం కృషి చేస్తోంది. రాష్ట్ర పోలీసులు కూడా రాష్ట్రాన్ని మత్తు పదార్థాల రహిత తెలంగాణ మార్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, హుక్కా పార్లర్ల నిషేధం విధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే వీటి నిషేధంపై బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. చర్చ లేకుండానే హుక్కా బిల్లును సభ ఆమోదించింది. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపంతో సభ మొదలైంది.

రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని సీఎం భావించిన నేపథ్యంలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టిన సిగరెట్లు, పొగాకు ఉత్పత్తి, సరఫరా నియంత్రణ, ప్రకటనల నిషేధ బిల్లుకు ఆమోదం లభించింది. సిగరెట్‌ కంటే హుక్కా పొగ మరింత హానికరమని హుక్కాలలో బొగ్గు ఉపయోగించడం వల్ల కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలవుతుందని శ్రీధర్‌బాబు అన్నారు. హుక్కా సేవించే వారి వల్ల.. చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదం జరుగుతుందని ఆయన సభలో ప్రస్తావించారు.