అమెరికాలో మంకీపాక్స్‌ కలకలం..అత్యవసర పరిస్థితి ప్రకటన

న్యూయార్క్ లో 1,345 కేసులు

1-in-4-monkeypox-cases-in-us-in-new-york-virus-sparks-fresh-alarm

న్యూయార్క్‌ః అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రాలొ మంకీ పాక్స్‌ కలకలం రేపుతుంది. అమెరికాలోని ప్రతీ నాలుగు మంకీపాక్స్ కేసుల్లో ఒకటి న్యూయార్క్ లోనే ఉంది. దీంతో విపత్తు అత్యయిక స్థితిగా న్యూయార్క్ రాష్ట్రం ప్రకటించాల్సి వచ్చింది. ట్విట్టర్ లో న్యూయార్క్ గవర్నర్ కాచీ హోచుల్ దీనిపై ప్రకటన చేశారు. వైరస్ తీవ్రతను తెలియజెప్పే ప్రయత్నం చేశారు.

‘‘దేశంలోని ప్రతి నాలుగు మంకీపాక్స్ కేసుల్లో ఒకటి కంటే ఎక్కువ న్యూయార్క్ లోనే ఉన్నాయి. రిస్క్ గ్రూపులపై దీని ప్రభావం అసాధారణంగా ఉంది. మరిన్ని టీకాలను సమకూర్చుకునేందుకు విశ్రమించకుండా పనిచేస్తున్నాం. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్నాం. సురక్షితంగా ఎలా ఉండాలన్న దానిపై న్యూయార్క్ వాసులకు తెలియజేస్తున్నాం. మంకీపాక్స్ నివారణకు మేం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా రాష్ట్ర అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నా’’ అంటూ న్యూయార్క్ మహిళా గవర్నర్ అయిన హోచుల్ ప్రకటించారు.

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తాజా డేటాను చూస్తే.. అమెరికాలో మంకీపాక్స్ కేసులు 5,189కు పెరిగాయి. ప్రపంచంలో అత్యధిక కేసులు ఉన్న దేశంగా అమెరికా రికార్డులకు ఎక్కింది. ఇందులో 1,345 కేసులు న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ తర్వాత క్యాలిఫోర్నియా, ఇల్లినాయిస్ లో ఎక్కువ కేసులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 22,000కు చేరాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/