ఢిల్లీలో సెక్ష‌న్ 144 విధింపు.. భద్రత కట్టుదిట్టం

Farmers ‘Chalo Dilli’ protest: Delhi Police imposes Section 144, tightens security

న్యూఢిల్లీ: క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌పై చ‌ట్టాన్ని రూపొందించాల‌ని కోరుతూ రైతులు ఛ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో సెక్ష‌న్ 144వ సెక్ష‌న్ విధించిన‌ట్లు పోలీసు క‌మీష‌న‌ర్ సంజ‌య్ అరోరా తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన రైతు సంఘాలు ఛ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నాయి. మార్చి 12వ తేదీ వ‌ర‌కు కూడా భారీ జ‌న‌స‌మూహాన్ని నిషేధించారు. ఎక్కువ సంఖ్య‌లో జ‌నం గుమ్మికూడ‌రాదు అని పోలీసు ఆఫీస‌ర్ ఆరోరా తెలిపారు.

దేశ‌వ్యాప్తంగా 200 రైతు సంఘాలు, సుమారు 20వేల మంది రైతులు ఢిల్లీపై దండ‌యాత్ర చేయ‌నున్నారు. క‌మీష‌న‌ర్ సంజ‌య్ అరోరా ఇచ్చిన ఆదేశాల్లో ట్రాక్ట‌ర్ల‌పై కూడా నిషేధం విధించారు. పిస్తోళ్లు, మండే సామాగ్రిని కూడా ప‌ట్టుకెళ్ల‌రాదు. ఇటుక‌లు, రాళ్ల‌ను కూడా తీసుకువెళ్ల‌రాదు. పెట్రోల్ క్యాన్లు, సోడా బాటిళ్ల‌పైన కూడా నిషేధం విధించారు. లౌడ్ స్పీక‌ర్ల‌ను కూడా బ్యాన్ చేస్తున్న‌ట్లు ఆరోరా త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎవ‌రైనా ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే, వారిని అరెస్టు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. సింగు, ఘాజిపుర్, టిక్రి బోర్డ‌ర్ల వ‌ద్ద ట్రాఫిక్ ఆంక్ష‌ల‌ను విధించారు. న‌గ‌రానికి అన్ని వైపుల ఉన్న బోర్డర్‌ల‌ను క‌ట్టుదిట్టం చేశారు.