నేటి నుండి నామినేషన్లు మొదలు

నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తాలూకా నామినేషన్ ప్రక్రియ మొదలుకాబోతుంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్‌ జరుగనుండగా.. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. పోలింగ్‌ ప్రక్రియ మొత్తం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)ల ద్వారా నిర్వహించనున్నారు.

పోస్టల్‌ బ్యాలట్‌, ఇంటి వద్ద ఓటు వేసే వారి కోసం సిద్ధం చేసిన బ్యాలెట్‌ పేపర్‌ గులాబీ రంగులో ఉండనుంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి ఆ దరఖాస్తును రిటర్నింగ్‌ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో తొలిసారిగా ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం దివ్యాంగులకు, 80 యేండ్ల పైబడిన వారందరికి కల్పించింది. అయితే ఇలా ఇంటి వద్దనే ఓటు వేయాలనుకొనేవారు ఈనెల 7వ తేదీలోగా బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌వో) దగ్గర ‘12డీ’ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. వీరితో పాటుగా 13 అత్యవసర సేవలు అందించే శాఖల సిబ్బంది, ఉద్యోగులు, అధికారులకు పోస్టల్‌ ఓటు సౌకర్యం కల్పించారు. వీరు ఆయా శాఖల నోడల్‌ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీరితో పాటు ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి కూడా పోస్టల్‌ బ్యాలట్‌ సౌకర్యం కల్పించారు.