ఫిబ్ర‌వ‌రి 3 నుండి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 03 నుండి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ శుక్రవారం మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు సమావేశాలను ప్రారంభించనున్నట్లుగా స్టేట్ లెజిస్లేచర్ సెక్రెటరీ వి నరసింహాచార్యలు ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్ ను కూడా ఫిబ్రవరి 03 నే ప్రవేశపెడతారని తెలుస్తోంది. తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు బడ్జెట్ కు రూపకల్పన చేస్తున్నారు.

2023-24 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ ఈ మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్ రావు కూడా హాజరయ్యారు. కాగా, బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నట్లు సమాచారం.