తెలంగాణ శాసనసభ సమావేశాలు : ఉభయ సభలు సోమవారానికి వాయిదా..

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు కొద్దీ సేపటి క్రితం ప్రారంభమయ్యాయి. శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమయ్యాయి. ముందుగా ఇటీవల మరణించిన శాసనసభ్యులకు సంతాపాలు ప్రకటించారు.

అసెంబ్లీలో అజ్మీర్‌ చందూలాల్‌, కేతిరి సాయిరెడ్డి, ఎంఎస్‌ఆర్‌, మాచర్ల జగన్నాథం మృతికి సంతాపం తెలిపారు. మండలిలో రెహమాన్‌, లింబారెడ్డి, లక్ష్మారెడ్డిలకు నివాళులర్పించారు. మొత్తం 9 మంది మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించి ఉభయసభలు సోమవారానికి వాయిదా పడింది. 25, 26 తేదీల్లో సమావేశాలకు విరామం ప్రకటించి, తిరిగి 27వ తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక ఈ సమావేశాల్లో ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన దళిత బంధు పథకంపై చర్చించనున్నారు. దీనిపై ప్రత్యేక చర్చ చేపట్టాలని సీఎం కేసీఆర్ స్పీకర్ అనుమతి కోరే అవకాశం ఉంది. యాసంగిలో వరిసాగు, ధాన్యం కొనుగోలు అంశం, తెలుగు రాష్ర్టాల మధ్య జలజగడం, ఉద్యోగ నియామకాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ ప్రైవేటీకరణ, విద్యుత్ ఛార్జీల పెంపు సహ ఇతర అంశాలపై సభ్యులు చర్చించనున్నారు.