వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాగిన జగన్ ముంపు పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ముంపుకు గురైన లంక గ్రామాలను సందర్శించారు. ఓ పక్క జోరు వర్షం పడుతున్నప్పటికీ ..జగన్ వర్షాన్ని లెక్క చేయకుండా బాధితులను పరామర్శించారు. వరద నష్టంపై అంచనాలు పూర్తికాగానే ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం అందిస్తామని తెలిపారు. గతంలో ఏనాడూ లేని విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వరద బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. శిబిరాల్లో బాగా చూసుకున్నారా అంటూ బాధితులను సీఎం అడిగారు.

శిబిరాల్లో తమను బాగా చూసుకున్నారని వరద బాధితులు జగన్‌కు తెలిపారు. వరదలు రాగానే ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తక్షణ సహాయ కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. వెంటనే అధికారులందరినీ క్షేత్రస్థాయిలోకి పంపామని, ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కోనసీమలోని లంక గ్రామాల పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శిస్తున్న క్రమంలో సీఎం జగన్‌ ఓ 8 నెలల పిల్లవాడిని ఎత్తుకున్నారు. ముఖ్యమంత్రి జేబులోని పెన్నుతో బుడ్డోడు ఆడుకున్నాడు. ఇంతలో ఆ పెన్ను పొరపాటున జారి కింద పడింది. అనంతరం పెన్నుపై పిల్లవాడి ముచ్చటను చూసిన సీఎం జగన్‌.. ఆ ఖరీదైన పెన్ను అతనికి గిఫ్ట్‌గా ఇచ్చారు. దీంతో బాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.