‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ మూవీ నుండి లిరికల్ సాంగ్ రిలీజ్

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. ప్రస్తుతం ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ మూవీ తో మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా ‘నీతో ఈ గడిచిన కాలం .. నడిచిన దూరం ఎంతో ఇష్టం’ అంటూ ఈ మెలోడీ గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేసారు.

ఈ పాట కూడా ‘కనుల చాటు మేఘమా’, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టైటిల్ సాంగ్ తరహాలోనే వినసొంపుగా, వినగానే నచ్చేలా ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాలలోని మెలోడీ పాటలు ఎంతలా ఆకట్టుకున్నాయో.. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి విడుదలవుతున్న ఒక్కో పాట అంతకుమించి అనేలా ఉన్నాయి. ‘నీతో ఈ గడిచిన కాలం’ పాట చిరుజల్లులో ప్రేయసితో కలిసి నడిచినట్లుగా హాయిగా ఉంది. మెలోడీలను స్వరపరచడంలో కళ్యాణి మాలిక్ ది ప్రత్యేక శైలి అని ఈ పాటతో మరోసారి రుజువు చేసుకున్నారు. ఈ పాటకు ప్రముఖ గీత రచయిత భాస్కర భట్ల రవికుమార్ అద్భుతమైన సాహిత్యం అందించారు. గాయని గీతామాధురితో కలిసి కళ్యాణి మాలిక్ ఈ పాటను ఎంతో అందంగా ఆలపించారు. హీరో – హీరోయిన్ ఒకరిపై ఒకరికున్న ఇష్టాన్ని, ప్రేమని తెలిపేలా ఈ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తుంది.

దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ చిత్రానికి డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు వచ్చి చక్కటి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి వీరి కలయికలో సినిమా వస్తుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.

YouTube video