టిడిపి లేకుండా చేయడానికి జగన్ చేయని ప్రయత్నం లేదుః అచ్చెన్నాయుడు

జగన్ మన రాష్ట్రానికి పట్టిన శని అన్న అచ్చెన్నాయుడు

TDP AP president Atchannaidu

అమరావతిః సిఎం జగన్‌ ఒక సైకో అని, ఆయన రాష్ట్రానికి పట్టిన శని అని టిడిపి నేత అచ్చెన్నాయుడు అన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో ఆశలను కల్పించి మోసం చేశారని విమర్శించారు. ఏపీలో టిడిపినే లేకుండా చేయడానికి జగన్ చేయని ప్రయత్నం లేదని… అన్నింటిని తట్టుకుని ధైర్యంగా నిలబడ్డామని చెప్పారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపి 160 సీట్లను గెలుచుకోవడం ఖాయమని అచ్చెన్న ధీమా వ్యక్తం చేశారు. ఏపీని జగన్ నాశనం చేశారని… రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టే బాధ్యతను టిడిపి తీసుకుంటుందని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి మాదిరి టిడిపి గాలికి పుట్టిన పార్టీ కాదని అన్నారు. పాలన అంటే కేవలం బటన్ నొక్కడం కాదని ఎద్దేవా చేశారు. సంపదను సృష్టించి పేదలకు పంచాలే కానీ, అప్పులు చేస్తూ బటన్ నొక్కడం గొప్ప కాదని అన్నారు.

పులి అని చెప్పుకునే జగన్ పిల్లికంటే హీనంగా మారిపోయాడని… చివరకు ఎమ్మెల్యేలను కూడా బతిమిలాడుకుంటున్నాడని అచ్చెన్న విమర్శించారు. ఇది టిడిపి తొలి విజయమని అన్నారు. పులివెందులలో సైతం టిడిపి విజయం సాధించిందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధానిని కోరుకోవడం లేదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు టిడిపి బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.