టిడిపి హయాంలో 12 లక్షల ఇళ్లు నిర్మించాం: దేవినేని ఉమ

వైఎస్‌ఆర్‌సిపి ఎన్ని కట్టారో చెప్పాలని డిమాండ్

devineni uma maheswara rao
devineni uma maheswara rao

అమరావతిః గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, వైఎస్‌ఆర్‌సిపి నేతలపై టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడ సమీపంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నిన్న ఉమ మాట్లాడుతూ.. తాము కట్టిన ఇళ్లకు వైఎస్‌ఆర్‌సిపి రంగులేసుకుని తాము నిర్మించినట్టు ప్రగల్భాలు పలుకుతోందని విమర్శించారు.

టిడ్కో ఇళ్లను టిడిపి నిర్మించిన విషయం కొడాలి నానికి తెలియదా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా మూలన పడేసిన ఇళ్లను ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా రంగులేసి తమ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. భవనాలు నిర్మించిన వారిని బిల్డర్లు అంటారని, రంగులేసే వారిని పెయింటర్లు అంటారని ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో 12 లక్షల ఇళ్లు నిర్మించామని, నాలుగేళ్లలో వైఎస్‌ఆర్‌సిపి కట్టిన ఇళ్లు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు.