వైఎస్‌ఆర్‌సిపి దాడులకు తాము భయపడబోం: ఆనం వెంకట రమణారెడ్డి

దాడులు చేయడం మాకూ వచ్చు.. అనుకుంటే అరగంటలో స్కెచ్ వేస్తాం.. ఆనం

tdp-leader-anam-venkata ramana-reddy-comments-on-ysrcp-leaders

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి దాడులకు తాము భయపడబోమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. తమపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం టిడిపి సంప్రదాయం కాదన్నారు. కానీ రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోమవారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దాడులు మేం చేయలేమా? మీకు చేతనైంది మాకు చేతకాదా? మీరు చేసిన పని మేం చేయాలంటే ఎంత సేపు? దాడులు చేయడం మాకూ వచ్చు.. మేమూ చేయగలం.. అనుకుంటే అరగంటలో స్కెచ్ వేయగలం’’ అని హెచ్చరించారు.

‘‘ఇదేనా రాజకీయం? దాడులు చేయడం కాదు.. దమ్ముంటే రా జగన్.. ఎనీ టైం.. ఎనీ ప్లేస్.. ఎనీ వేర్.. ప్లేస్ నువ్వు చెప్పు.. ఇదేందండి ఇది.. పారిపోవడం ఏంటి? పది మంది పిలకాయల్ని మందు, గంజా తాగించి పంపిస్తారా?’’ అని నిలదీశారు. ఎప్పుడు, ఎక్కడికి రావాలో చెప్పాలని, తాము వస్తామని సవాల్ విసిరారు. ‘‘రేపు టిడిపి ప్రభుత్వం రాదని అనుకుంటున్నారా? మీ ఇళ్లలోకి దూరి దాడులు చేయాలని అనుకుంటున్నారా? అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి.. అదే జరిగితే మీరు అయిపోతారు’’ అని ఆనం వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. దాడులు చేసే సంస్కృతి టిడిపిలో లేదని, ఇకపైనా రాదని అన్నారు. దాడులను చంద్రబాబు సమర్థించరని చెప్పారు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుందని, అది దాటితే మంచిది కాదని హితువు పలికారు.