టీడీపీ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి..సీఎం జగన్ పిలుపు

ఏపీలో మరో నాల్గు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.తన దగ్గర చంద్రబాబులాగా డబ్బులు లేవు.. ఆయన దగ్గర ప్రజల నుంచి దోచుకున్న డబ్బు ఉందని .. పోలింగ్‌కు ముందు టీడీపీ వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి.. అవి మీ దగ్గర నుంచి దోచుకున్న డబ్బేనని జగన్ చెప్పుకొచ్చారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్‌ భారీ బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..జూన్‌ 4న విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. మూడు జిల్లాలను ఆరు జిల్లాలను చేశామని గుర్తు చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్దాన సమస్యను పరిష్కరించామని, కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేశాడని మండిపడ్డారు సీఎం జగన్‌. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతో కలిశాడని దుయ్యబట్టారు. చంద్రబాబు దగ్గర ప్రజల నుంచి దోచేసిన సొమ్ము చాలా ఉంది. దోచేసిన సొమ్ముతో చంద్రబాబు ఓటర్లను ప్రలోభపెడతారని అన్నారు. బాబు డబ్బులిస్తే తీసుకోండి.. కానీ ఓటేసే ముందు ఆలోచించాలని సూచించారు.