నల్లజర్లలో ఉద్రిక్తత..వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య కొట్లాట

మరో నాల్గు రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు దాడికి పాల్పడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. మంత్రి తానేటి వనిత ప్రచారంలో వివాదం చెలరేగింది. నల్లజర్లలో ప్రచారం చేస్తున్న తానేటి వనిత ప్రచారంపై ప్రత్యర్థులు దాడి చేశారు. అంతకు ముందు ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు హంగామా చేయడంతోనే గొడవ జరిగిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

ద్విచక్రవాహనంలో వచ్చిన వైసీపీ శ్రేణులు… బైక్ సైలెన్సర్లు తీసేసి బీభత్సం సృష్టించారు. అక్కడే ఇరు వర్గాలకు వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో పలువురు టీడీపీ శ్రేణులు గాయపడ్డారు. దీన్ని మనసులో పెట్టుకున్న టీడీపీ కార్యకర్తలు హోంమంత్రి వనిత ప్రచార కార్యక్రమంలో ప్రతికారం తీర్చుకున్నారు. అక్కడ ఉన్న కుర్చీలను విరగ్గొట్టారు. అంతేకాదు పక్కనే ఉన్న డీజే వ్యాన్లతోపాటు ఇతర కారు అద్దాలు ధ్వంసం చేశారు. గొడవ విషయాన్ని తెలుసుకున్నపోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.