మనల్ని విభజించే వాటిపై కాదు.. ఏకం చేసే దానిపై దృష్టి పెట్టాలిః ప్రధాని మోడీ
జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో మోడీ ప్రసంగం

న్యూఢిల్లీః ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు మందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచదేశాల మధ్య సంబంధాలు తెగిపోతున్న సమయంలో జీ20 సదస్సు జరుగుతున్నందున.. అన్ని దేశాలు సదస్సు వైపే చూస్తున్నాయని ఆయన అన్నారు. జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ప్రధాని మోడీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సమావేశం కోసం ముందుగానే రికార్డు చేసిన ఓ సందేశంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని అంశాల్లో గ్లోబల్ గవర్నెన్స్ విఫలమైందని చెప్పారు. ‘‘ప్రపంచ విచ్ఛిన్నం జరుగుతున్న సమయంలో మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఇప్పుడు ఇక్కడ లేని వారి బాధ్యత కూడా మన మీదు ఉంది’’ అని వివరించారు.
తమ నిర్ణయాల వల్ల, చర్యల వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాల మాట వినకుండా.. ఏ దేశమూ కూడా తనను తాను ‘ప్రపంచ లీడర్’నని చెప్పుకోలేదని ప్రధాని అన్నారు. ‘‘మనల్ని ఏది ఏకం చేస్తుందో దానిపై దృష్టి పెట్టాలి. మనల్ని విభజించే వాటిపై కాదు’’ అని స్పష్టం చేశారు ‘‘ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రపంచ స్థాయి సంస్థలు విఫలమయ్యాయి. బహుళపక్షవాదం (మల్టీలేటరలిజం) నేడు సంక్షోభంలో ఉందని మనమందరం అంగీకరించాలి. ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, యుద్ధాలు వంటి అనుభవాలు ప్రపంచ పాలన విఫలమైందని స్పష్టం చేస్తున్నాయి’’ అని మోడీ వివరించారు.
‘‘ఏళ్ల తరబడి పురోగతి సాధించిన మనం.. ఇప్పుడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. ప్రజలకు ఆహార, ఇంధన భద్రతపై భరోసా కల్పించే ప్రయత్నాల్లో ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు.. తీవ్రమైన అప్పులతో సతమతమవుతున్నాయి. సంపన్న దేశాల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ఇవి ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. అందుకే భారతదేశం తనకు లభించిన జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలతో.. దక్షిణాది దేశాల తరఫున గొంతు వినిపించడానికి ప్రయత్నిస్తోంది’’ అని ప్రధాని అన్నారు.