ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు

Chandrababu

ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోడీ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావు కన్నుమూయడం తో నిన్న మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకొని రామోజీ రావు కు నివాళ్లు అర్పించారు. అలాగే ఈరోజు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. స్వయంగా రామోజీ రావు పాడేమోసి అందర్నీ కట్టిపడేసారు. అంత్యక్రియలు పూర్తి కాగానే ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఈ రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరిగే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరు కానున్నారు.

కాగా, ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి వెలుపలికి వచ్చే సమయంలో పలువురు నేతలు చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో జూన్ 12న ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

ఇక మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం ఏడు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అఫీఫ్‌ , మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్గే , నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహాల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, మారిషస్‌ ప్రధాని ప్రవిండ్‌ కుమార్‌ జగన్నాథ్ హాజరుకాబోతున్నారు. మొత్తం 8,000 మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరు కానున్నారు.