NDA ఎంపీలకు నోరూరించే విందు సిద్ధం చేసిన నడ్డా

ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోడీ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం ఏడు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అఫీఫ్‌ , మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్గే , నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహాల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, మారిషస్‌ ప్రధాని ప్రవిండ్‌ కుమార్‌ జగన్నాథ్ హాజరుకాబోతున్నారు. మొత్తం 8,000 మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరు కానున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో మోడీతో పాటు కీలక మంత్రులు 30 మంది వరకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సారి మొత్తం 78 మందికి మంత్రి పదువులు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. గత మంత్రి వర్గంలో కీలక శాఖలు నిర్వహించిన వారు కూడా ఈ జాబితాలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్డీయే ఎంపీలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పసందైన విందు ఇస్తున్నారు. ఈ డిన్నర్ పార్టీకి సంబంధించిన మెనూ కూడా వెల్లడైంది.

ఈ వేసవిలో అధిక వేడిమిని దృష్టిలో ఉంచుకుని, ఈ విందులో ఐదు రకాల ఫ్రూట్ జ్యూస్ లు, వివిధ ఫ్లేవర్లలో షేక్ లు, స్టఫ్డ్ లిచీ, మట్కా కుల్ఫీ, మ్యాంగో క్రీమ్, మూడు ఫ్లేవర్లలో రైతా అందించనున్నారు. అంతేకాదు, జోధ్ పురీ సబ్జి, పప్పు, దమ్ బిర్యానీ, ఐదు రకాల రొట్టెలు వడ్డించనున్నారు. రుచికరమైన పంజాబీ వంటకాల కోసం ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు.