చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లఫై సీఎస్ సమీక్ష

చంద్రబాబు 4 వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జూన్-12న బుధవారం ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మొదట మంగళగిరి ఎయిమ్స్ స్థలం బాగుంటుందని భావించినప్పటికీ.. దీని కంటే ఐటీ పార్క్ స్థలం అనువైనదిగా టీడీపీ నేతలు భావించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ తో పాటు NDA నేతలు , ఇతర పార్టీల సీఎం లు హాజరు కాబోతుండడంతో అలాగే కూటమి శ్రేణులు సైతం పెద్ద ఎత్తున హాజరు కాబోతుండడం తో ఎయిమ్స్ స్థలం సరిపోదని.. ఐటీ పార్క్ వద్ద అయితే బెటర్ అని టీడీపీ క్యాడర్ డిసైడ్ అయ్యి అక్కడ ప్రమాణ స్వీకర ఏర్పాట్లు చేస్తుంది.

ఈ క్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. విస్తృత మైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని , గన్నవరం విమానాశ్రయంలో వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖుల విమానాలు, హెలికాప్టర్లకు తగిన పార్కింగ్​కు ఏర్పాట్లు చేయాలని ఎయిర్ అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే కేంద, రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఇతరుల వాహనాల పార్కింగ్​కు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు.

ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు ఎం.రవి చంద్ర, శశి భూషణ్ కుమార్, అదనపు డీజీపీ ఎస్.బాగ్చి తదితరులు హాజరయ్యారు.