ఎన్నికలలో గెలిచామని చెప్పుకోవడానికి ఇంత దారుణంగా వ్యవహరిస్తారా?

ఇంత దారుణమా? ఇలాగైతే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తారు: చంద్రబాబు

కుప్పం : ఎన్నికల ప్రక్రియను వైస్సార్సీపీ ప్రభుత్వం అపహాస్యం పాలు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయబోతున్నారని తాము ముందే చెప్పామని… ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు. చివరకు మున్సిపల్ ఎన్నికలను కూడా అపహాస్యంపాలు చేశారని మండిపడ్డారు. ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని అక్రమాలకు పాల్పడాలా? అని ప్రశ్నించారు. గెలిచామని చెప్పుకోవడానికి ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని చెప్పారు. కుప్పంలో బయట నుంచి వచ్చిన దొంగ ఓటర్లు ఓటు వేస్తున్నారని.. రాత్రి కొందరు దొంగ ఓటర్లను టీడీపీ నేతలు పట్టుకున్నారని చంద్రబాబు తెలిపారు. దొంగలకు వంతపాడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలింగ్ ఏజంట్లను అరెస్ట్ చేసి వేరే ప్రాంతాలకు పంపిస్తున్నారని దుయ్యబట్టారు.

అధికారంలో ఉన్నాం ఏం చేసినా సరిపోతుందని అనుకుంటే శిక్ష అనుభవించకతప్పదని చంద్రబాబు అన్నారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని… ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం చేతకాకపోతే వెళ్లిపోవచ్చని అన్నారు. ఎన్నికలను ప్రభుత్వమే నిర్వహించుకోవచ్చని చెప్పి పోవచ్చు కదా? అని అన్నారు. వైస్సార్సీపీ ఎంపీలు, మేయర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లారని… వారి వాహనాలను పోలీసులు ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. శాంతిభద్రతల పేరుతో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇష్టానుసారం వ్యవహరిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారన్నారు. రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/