సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించిన కిషన్ రెడ్డి..

ఖమ్మం జిల్లాలో పోలీసుల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆత్మహత్యకు యత్నించిన సాయి గణేష్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన పట్ల బిజెపి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనికి కారణమైన పోలీసులు , మంత్రులు , నేతలఫై కేసులు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించగా..ఈరోజు శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయిగణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మంత్రి, పోలీసులు కలిసి సాయిగణేష్ ను వేధించారని విమర్శించారు. పోలీసులు చిన్న కార్యకర్తపై ఎందుకు అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని…అనేక మంది మహానుభావులు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించారని.. ఎవరి కుటుంబాలు శాశ్వతంగా లేవని… ఇది ఏం నిజాం పరిపాలన కాదని కిషన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో సాయి గణేష్ పై జరిగిన దౌర్జన్యకాండ, హత్య కాండపై న్యాయం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ఘటన వెనక ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, పోలీసులపై కేసులు పెట్టాల్సిందే అని… వాళ్లు కూడా జైలుకు వెళ్లాల్సిందే అని హెచ్చరించారు.