భర్తతో కలిసి అమెరికాకు వెళ్లిన జపాన్‌ మాజీ రాకుమారి

ప్రేమ కోసం రాచరికాన్ని, కోట్లాది రూపాయల సంపదను తృణప్రాయంగా వదిలేసుకున్న రాకుమారి

టోక్యో: తన స్థాయి.. అంతస్తు.. వంశ ప్రతిష్ఠ కంటే ప్రేమ గొప్పదని నిరూపించిన జపాన్ రాకుమారి ఇప్పుడు స్వదేశానికి వీడ్కోలు పలికేసింది. కళాశాలలో తన క్లాస్‌మేట్ అయిన కీ కొమురోను ప్రేమించి పెళ్లాడి యువరాణి హోదాతోపాటు రాచరికాన్ని వదులుకున్న జపాన్ మాజీ రాకుమారి మాకో కొమురో స్వదేశానికి గుడ్‌బై చెప్పేశారు. భర్త కీతో కలిసి నిన్న అమెరికా వెళ్లిపోయారు. జపాన్ చక్రవర్తి నరుహిటో మేనకోడలైన మాకో గత నెలలో తన కాలేజీ మేట్ అయిన కీ కొమురోను వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి రాజ కుటుంబం అనుమతి లేకపోవడంతో టోక్యోలో అత్యంత నిరాడంబరంగా జరిగింది.

కీని పెళ్లి చేసుకోవడం ద్వారా తన రాచరికపు హోదా పోతుందని తెలిసినా మాకో లెక్క చేయలేదు. రాచరికాన్ని వదులుకోవడం ద్వారా రావాల్సిన కోట్లాది రూపాయలను కూడా తృణప్రాయంగా వదులుకున్నారు. ప్రేమ కోసం అన్నింటినీ వదులుకుని సామాన్యురాలిగా మారిన మాకో ఇప్పుడు కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ అమెరికా వెళ్లిపోయారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/