జగన్ పై అచ్చెన్నాయుడు విమర్శలు

రాష్ట్రాన్ని రావణ కాష్ఠం చేస్తున్నారు.. అచ్చెన్నాయుడు

అమరావతి: టీడీపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్ పై మండిపడ్డారు. రాష్ట్రాన్ని జగన్ నిత్యం రావణ కాష్ఠంలా రగిలిస్తూనే ఉన్నారని, అభివృద్ధికి మారుపేరుగా ఉండే ఆంధ్రప్రదేశ్ ను దుర్మార్గాలు, అరాచకాలు, అకృత్యాలు, దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని విమర్శించారు. రాష్ట్రంలో రాజారెడ్డి కత్తుల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని చంపేందుకు తెగిస్తున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం ఆర్.నడింపల్లిలో టీడీపీ కార్యకర్త మునెప్పపై వైస్సార్సీపీ నేతలు కత్తులతో దాడి చేయడంపై ఆయన మండిపడ్డారు. ఘటనపై ప్రకటన విడుదల చేశారు.

జగన్ పాలనలో దాడులు జరగని రోజు.. జరగని ప్రాంతం లేకుండా పరిస్థితి తయారవుతోందని ఆయన విమర్శించారు. పేదల ఆస్తులను ఆక్రమించేందుకు, మారణ హోమం సృష్టించేందుకే ప్రజలను ఒక్క అవకాశం అడిగారా? అని జగన్ ను నిలదీశారు. మునెప్ప భూమిని వైస్సార్సీపీ నేతలు కబ్జా చేశారని, అడ్డుకునే ప్రయత్నం చేస్తే కత్తులతో దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరితో ప్రజలు స్వేచ్ఛగా బతకలేకపోతున్నారన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/