వైఎస్‌ విజయమ్మ పార్టీ కి రాజీనామా చేస్తారని నేను ముందే ఊహించాను – రఘురామ

వైస్సార్సీపీ పార్టీ అధ్యక్ష పదవికి వైస్ విజయమ్మ రాజీనామా చేసారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే ప్లీనరీ వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటన రాగానే ప్రతిపక్ష పార్టీ లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ రెబెల్ ఎంపీ గా గుర్తింపు తెచ్చుకున్న ఎంపీ రఘురామకృష్ణం రాజు విజయమ్మ రాజీనామా చేస్తుందని ముందే ఉహించానని చెప్పుకొచ్చారు.

పార్టీ ప్లీనరీ సమావేశం.. విజయమ్మకు వీడ్కోలు సభలా ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు. అమ్మ రాజీనామానా.. అమ్మతో రాజీనామానా? అని అందరూ అడుగుతున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. విజయమ్మ రాజీనామా చేస్తారని తాను ముందే చెప్పానని అన్నారు. అమ్మ రాజీనామా చేయడం కరెక్ట్.. అమ్మతో రాజీనామా కూడా కరెక్టు అని కామెంట్ చేశారు. జగన్ జైలులో ఉన్నప్పుడు దేహీ అంటూ విజయమ్మ తిరిగారని రఘురామ గుర్తుచేశారు.పార్టీ అధ్యక్షుడు ఎన్నికలు జరగాలని, ఎన్నికలు లేకపోతే పదవిలో ఐదు ఏళ్ళు మాత్రమే ఉండాలని అన్నారు రఘురామ. పార్టీ శాశ్వత అధ్యక్ష ఎంపికపై కోర్టుకు వెళతానని చెప్పుకొచ్చారు.

గత కొద్దీ నెలలుగా వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు నడుస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్.. తన తల్లి, చెల్లిని దూరం పెట్టారనే టాక్ బలంగా వినిపిస్తూ వచ్చింది. వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడం.. విజయమ్మకు ఆమెకు అండగా ఉండటంతో ఈ వాదనకు బలం చేకూరింది. జగన్ ను ఇటీవల కాలంలో విజయమ్మ కలవలేదు. విజయమ్మ పుట్టినరోజు కూడా జగన్ ఆమెను కలవలేదు. తన బర్త్ డే రోజు ఖమ్మం జిల్లాలో పాదయాత్రలో ఉన్న షర్మిల దగ్గరకు వెళ్లింది విజయమ్మ. దీంతో జగన్, విజయమ్మ మధ్య గ్యాప్ భారీగా పెరిగిపోయిందనే ప్రచారం సాగింది. విపక్షాలు కూడా ఇవే అరోపణలు చేస్తూ వస్తున్నాయి. అధికారం దాహంతో తల్లి, చెల్లిని జగన్ బయటికి పంపించేశారని చెపుతూ ఉన్నాయి. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి వైస్సార్సీపీకి గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు విజయమ్మ. జగన్ తో విభేదాలతో ఆ పదవికి రాజీనామా చేస్తారనే చాలా కాలంగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని వైస్సార్సీపీ వర్గాలు ఖండిస్తూ వచ్చాయి. కానీ ఈరోజు స్వయంగా తానే రాజీనామా చేస్తున్నట్లు విజయమ్మ చెప్పడం వెనుక ఇదే కారణమని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

విజయమ్మ మాత్రం.. విమర్శలకు తావు లేకుండా తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సభ వేదికగా తెలిపారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. విమర్శలకు తావు లేకుండా ఉండేందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నా. తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకే రాజీనామా. షర్మిల ఒంటరి పోరాటానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం అని అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్‌తో ఉన్నా.. సంతోషం ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే నా రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసినదాన్ని అవుతానేమోనని నా మనస్సాక్షి చెబుతోంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో నన్ను క్షమించాలి అని ఆమె అన్నారు.