వినుకొండలో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి మధ్య ఘర్షణ.. గాల్లోకి పోలీసులు కాల్పులు

కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్న టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు

TDP and YSRCP
TDP and YSRCP

వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హింసకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే అక్రమ మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా టిడిపి శ్రేణులు ఉదయం ర్యాలీని నిర్వహించాయి. ఈ క్రమంలో ర్యాలీలో పాల్గొన్న పలువురు టిడిపి శ్రేణులపై పోలీసులకు కేసులు నమోదు చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టారంటూ మరోసారి టిడిపి శ్రేణులు నిరసన ర్యాలీని చేపట్టాయి. అదే సమయంలో టిడిపి శ్రేణులకు పోటీగా వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కారుపై టిడిపి శ్రేణులు రాళ్లు రువ్వాయి. ఇరు వర్గాల రాళ్ల దాడిలో 15 మంది గాయపడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం వినుకొండలో ఇంటర్నెట్ ను బంద్ చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అదనపు బలగాలను తరలించాలని ఉన్నతాధికారులను స్థానిక పోలీసులు కోరారు.