నేడు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుక

టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం వేడుక హైదరాబాద్ లో నేడు అట్టహాసంగా జరగబోతుంది. దివంగత నేత , మహా నటుడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రభంజనాన్ని సృష్టించింది. నేటితో 40 వసంతాలు పూర్తి చేసుకొని , 41 వ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్బంగా ఆవిర్భావ దినోత్సవ సభ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరపబోతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు తో పాటు ఏపీ, తెలంగాణలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నేడు సాయంత్రం 4గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు వెళ్లే ముందు చంద్రబాబుతో పాటు ఇతర నేతలు ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ లో ఎన్టీఆర్‌ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కు వెళ్లనున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆత్మగౌరవ నినాదంతో పుట్టి, తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. జై తెలుగుదేశం… జోహార్ ఎన్టీఆర్ అని అన్నారు.

అలాగే అమెరికా లో టీడీపీ 41వ ఆవిర్భావ దిన వేడుకలను వాషింగ్టన్‌ డీసీలో ఘనంగా నిర్వహించారు. తానా పూర్వాధ్యక్షుడు సతీష్‌ వేమన, గుంటూరు మిర్చి యార్డ్‌ మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు ముఖ్యఅతిథులుగా హాజరై ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.