జగన్‌కు అండగా నిలిచినందుకు మోసపోయాను – మేకపాటు చంద్రశేఖర్ రెడ్డి

క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో వైస్సార్సీపీ నుండి సస్పెండ్ కు గురైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైస్సార్ కుమారుడని మొదటి నుంచి జగన్‌కు అండగా నిలిచినందుకు మోసపోయానని అన్నారు. గత వారం రోజులుగా వైస్సార్సీపీ నేతలు సస్పెండ్ కు గురైన నలుగురు ఎమ్మెల్యేల ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నిత్యం విమర్శలు చేస్తూ..కార్యకర్తల్లో ఆగ్రహపు జ్వాలలు నింపుతూ వస్తున్నారు. దీంతో సదరు ఎమ్మెల్యే కార్యాలయాల్లో , ఆయా నియోకవర్గాల్లో సదరు ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం , ప్లెక్సీ లు చించేయడం వంటివి చేస్తూ వస్తున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కి కూడా ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి.

ఈ క్రమంలో మర్రిపాడులో ఆయన మీడియా తో మాట్లాడుతూ.. వైస్సార్ కుమారుడని మొదటి నుంచి జగన్‌కు అండగా నిలిచినందుకు మోసపోయానని అన్నారు. తనకు ఇలాంటి గౌరవం దక్కడం తన కర్మ అంటూ చెంపలు వాయించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఎవరి వద్దా చిల్లిగవ్వ కూడా తీసుకోలేదన్న ఆయన.. తాను డబ్బులు సంపాదించిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన నియోజకవర్గంలో ధనవంతులకే టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే జగన్, సజ్జల తనను అవమానపరుస్తున్నారని విమర్శించారు. సజ్జల తన నియోజకవర్గంలో ఒక్కో మండలానికి రూ. 5 లక్షల చొప్పున ఇచ్చి తన దిష్టిబొమ్మను దహనం చేయిస్తున్నారని ఆరోపించారు. తనను ఇలా హింసిస్తారని ఊహించి ఉంటే ముందు నుంచే వీళ్లకు దూరంగా ఉండేవాడినని మేకపాటి తెలిపారు.