వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మొదలైన పాపికొండల విహార యాత్ర

పాపికొండల అందాలను చూడాలని ప్రతి ఒకరు కోరుకుంటారు. కానీ అందాలను చూసేందుకు పకృతి నిత్యం సహకరించదు. భారీ వర్షాల కారణంగా పాపికొండల విహార యాత్ర కు బ్రేక్ పడుతూ ఉంటుంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన సమయంలో పాపికొండల విహార యాత్రకు అధికారులు అనుమతి ఇస్తుంటారు. గత కొద్దీ రోజులుగా అకాల వర్షాల కారణంగా ఇటీవల పాపికొండల విహార యాత్రను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో విహారయాత్రకు అధికారులు మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కంట్రోల్ రూము వద్ద తనిఖీల అనంతరం పర్యాటక బోట్లకు అనుమతులిచ్చారు. నిన్న ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి రెండు బోట్లు పర్యాటకులతో వెళ్లినట్టు అధికారులు తెలిపారు. ప్రకృతి అందాల మధ్య గోదావరి నదిపై పడవ ప్రయాణం ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.
రాజమహేంద్రవరం నుండి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభవం. పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుండి మొదవుతుంది. అక్కడినుండి పోలవరం, గొందూరు (పోచమ్మ గండి), సిరివాక, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది.

పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణము దీనిని ఆంధ్రా కాశ్మీరం అని పిలవకుండ ఉండనీయవు. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది.