టీడీపీ సభ్యులు తనను సీటు నుంచి తోసేందుకు ప్రయత్నించారు – స్పీకర్ తమ్మినేని

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం అసెంబ్లీ లో జరిగిన ఉద్రిక్తత ఫై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. టీడీపీ సభ్యులు తనను సీటు నుంచి తోసేందుకు ప్రయత్నించారని , కాగితాలు చింపి తనపై వేసేందుకు ప్రయత్నించినా తాను వాటిని పూవులుగానే భావించానని, తానేమి గౌతమ బుద్ధుడిని కాదని అన్నారు. టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమని, సభకు, సభాపతి స్థానానికి గౌరవం లేకుండా వ్యవహరించారని విమర్శించారు. టీడీపీ సభ్యులు నిరసన తెలియచేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ సభ్యుల ప్రవర్తన గర్హనీయం, ఆక్షేపణీయమని అన్నారు. సభ్యులు పోడియం వద్ద, సభాపతి స్థానం వద్దకు వచ్చి ఆటంక పరిస్తే ఆటోమేటిక్‌గా సస్పెన్షన్ అయ్యేలా రూలింగ్ ఉందని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.

మరోపక్క టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ .. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో దాడి జరిగిన తీరును లోకేష్‌కు గోరంట్ల వివరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా? అనే అనుమానం వస్తోందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే జీవో 1 రద్దు చేయాలని డిమాండ్ చేయడం కూడా జగన్ పాలనలో నేరమేనా? అని ప్రశ్నించారు. ఉన్నత విలువలతో సుధీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న గోరంట్లపై దాడి చేయడం దుర్మార్గమన్నారు.