ఏపీ అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారింది – సీపీఐ నారాయణ

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం అసెంబ్లీ లో జరిగిన ఉద్రిక్తత ఫై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. ఏపీ అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటి?.. వారు మనుషులా? పశువులా?.. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైస్సార్సీపీ పార్టీ పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉంది. నిరక్షరాస్యులకు ఓటు హక్కు కల్పించి మరి దొంగ ఓట్లు వేయించుకున్నారు. అయినా సరే ఓడిపోవడంతో నిరాశలో కూరుకుపోయారు. అందుకే అసెంబ్లీలో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప, ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక, కొడతారా?..స్పీకర్, సీఎం ఇద్దరిదీ తప్పు ఉంది. స్పీకర్ , సీఎం జగన్ ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసారు.

సోమవారం సభలో జీవో నెంబర్‌ 1పై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. అయితే టీడీపీ సభ్యుల తీరుపై వైస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు కూడా పోడియం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య టీడీపీ సభ్యులపైకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కొండేపి టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి , సంతనూతలపాడు టీజేఆర్ సుధాకర్ బాబు ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో స్పీకర్ సభను వాయిదా వేసి, 11 మంది టీడీపీ సభ్యులను ఓ రోజు సస్పెండ్ చేసారు.

ఈ ఘటన పట్ల చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇది శాసనసభ కాదు… కౌరవ సభ అంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కారణంగా జగన్ కు పిచ్చెక్కుతుందని చురకలు అంటించారు. ఏపీ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజు అంటూ పేర్కొన్నారు.