చంద్రబాబుకు సంఘీభావంగా రోడ్డుపైకి వేలాది మంది ఐటీ ఉద్యోగులు

సైకో పోవాలి.. సైకిల్ రావాలని నినాదాలు

IT employees hit the road in solidarity with Chandrababu

హైదరాబాద్‌ః హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ చంద్రబాబు నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబుకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినదిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబు వల్లే తామంతా ఉన్నత జీవితాన్ని గడుపుతున్నామని, ఆయన మాత్రం జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిజన్ బ్యాచ్.. విజన్ బ్యాచ్ ను టార్గెట్ చేసిందని మండిపడ్డారు. బాబు గారిని వెంటనే విడుదల చేయాలి, ఐయాం విత్ సీబీఎన్ వంటి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు ఐటీ ఉద్యోగులు బుద్ధి చెపుతారని హెచ్చరించారు. మరోవైపు ఆ ప్రాంతానికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిరసనకారులను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు.