సినిమా థియేటర్లలో మాస్క్ తప్పనిసరి చేసిన తమిళనాడు సర్కార్

దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతుండడం తో కేంద్రం పలు రాష్ట్రాలకు ఆంక్షలు విదిస్తుంది. ఈ క్రమంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేసులు పెరుగుతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. థియేటర్లతో పాటు ఆసుపత్రులకు వెళ్లే రోగులు, రోగుల బంధువులు కూడా మాస్క్ ధరించాలని సూచించింది.

ఈ సందర్బంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడులో కరోనా వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని తెలిపారు. అయితే, ముందుజాగ్రత్త చర్యగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, ఏసీ థియేటర్లు, ఆడిటోరియాలలో మాస్కులు ధరించాలని చెప్పారు. ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 59,512 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,641 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 4.47 కోట్లకు (4,47,26,246) చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 20 వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 20,219 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి 4.41 కోట్ల మంది (4,41,75,135) కోలుకున్నారు.