రాజకీయపార్టీ నాయకురాలిగా ఆమె మాట్లాడటం బాధాకరం

రాజ్యాంగ పరంగా కొన్ని పరిమితులు ఉంటాయన్న తలసాని

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌంద‌ర రాజన్ రాష్ట్ర ప్ర‌భుత్వంపై చేస్తోన్న విమ‌ర్శ‌లు స‌రికాద‌ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాజ్యాంగ పరంగా కొన్ని పరిమితులు ఉంటాయని, వాటికి అనుగుణంగానే ప‌ని చేయాల‌ని హిత‌వు పలికారు. గవర్నర్ తమిళిసై మాత్రం మీడియాతో అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారని ఆయ‌న విమ‌ర్శించారు.

ఓ రాజకీయపార్టీ నాయకురాలిగా ఆమె మాట్లాడటం బాధాకరమ‌ని అన్నారు. మహిళగా ఆమెను ఎంత గౌరవించాలో అంతగానూ గౌరవించామ‌ని, అనవసర గిల్లికజ్జాలు పెట్టుకోవడం సరికాదని అన్నారు. త‌మ‌ను ప్రజలే ఎన్నుకున్నారని, తాము నామినేటెడ్‌ వ్యక్తులం కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ‌ సీఎంతో పనిచేయడం ఇష్టంలేదని చెప్పడం గవర్నర్ అన‌డం ఏంట‌ని, ఆ వ్యాఖ్య‌ల‌ను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని త‌ల‌సాని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/