మాస్క్ ధరించకపోతే రూ.500 ఫైన్..ఢిల్లీ సర్కార్ కీలక ప్రకటన

కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతుంది. ఇప్పటికే మూడు వేవ్ లతో ప్రజలపై దాడి చేసిన ఈ మహమ్మారి..ఇప్పుడు నాల్గో వేవ్ తో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా మహమ్మారి వణికిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఢిల్లీలో విద్యార్థులు పెద్దఎత్తున కరోనా బారిన పడటం, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితిపై చర్చించేందుకు ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఆథారిటీతో వైద్యారోగ్యశాఖ అధికారులు బధవారం సమావేశమయ్యారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

బహిరంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా మాస్క్ ధరించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ( డీడీఎంఏ) ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించకపోతే రూ. 500 వరకు ఫైన్ వేయాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే పాఠశాలలను మూసివేయకూడదని అధికారులు నిర్ణయించారు. అయితే వైరస్‌ కట్టడికి నిపుణులతో చర్చింది ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను, టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.