స్వీడ‌న్ ప్ర‌ధానిగా మ‌గ్ద‌లినా అండ‌ర్స‌న్‌

స్టాక్‌హోమ్‌: స్వీడ‌న్ ప్ర‌ధానిగా సోష‌ల్ డెమోక్రాట్స్ నాయ‌కురాలు మ‌గ్ద‌లినా అండ‌ర్స‌న్ ఎంపిక‌య్యారు. ఇవాళ స్వీడ‌న్ పార్ల‌మెంట్‌లో జ‌రిగిన ఓటింగ్‌లో మ‌గ్ద‌లినాకు మెజారిటీ ఓట్లు వ‌చ్చాయి. దాంతో ఆమె ప్ర‌ధానిగా ఎన్నికైన‌ట్లు ప్ర‌కటించారు. ఈ విజ‌యంతో మ‌గ్ద‌లినాకు మ‌రో ఘ‌న‌త కూడా ద‌క్కింది. స్వీడ‌న్ దేశానికి ప్ర‌ధానిగా ఎంపికైన తొలి మ‌హిళ‌గా ఆమె ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

2022లో స్వీడ‌న్‌లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. త‌న త‌ద‌నంత‌రం కాబోయే ప్ర‌ధానికి ఈ ఎన్నిక‌ల స‌న్న‌ద్ధత కోసం త‌గినంత స‌మ‌యం ఇవ్వాల‌నే ఉద్దేశంతో స్వీడ‌న్ ప్ర‌ధాని స్టీఫ‌న్ లోఫ్‌వెన్ ఈ నెల 10న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న గ‌త ఏడేండ్లుగా స్వీడ‌న్ ప్ర‌ధానిగా ప‌నిచేశారు. ఈ నెల ప్రారంభంలో స్టీఫ‌న్ లోఫ్‌వెన్ ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి తప్పుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాంతో వెంట‌నే ఆ దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మ‌గ్ద‌లినా అండ‌ర్స‌న్‌ను సోష‌ల్ డెమోక్రాట్స్ నాయ‌కురాలిగా ఎన్నుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/