బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్​ పాయిజన్..

బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించింది. 600 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫ్రైడ్‌ రైస్‌ తిని వాంతులు, విరోచనాలలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లందరినీ చికిత్స కోసం నిజామాబాద్‌, బైంసా ఆసుపత్రులకు తరలించారు. కాగా, కుళ్లిన కోడి గుడ్లతో చేసిన ఫ్రైడ్‌ రైస్‌ వల్లే ఈ ఫుడ్‌ పాయిజన్‌ జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన గురించి తెలిసిన తల్లిదండ్రులు.. మెస్‌ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థుల మెస్‌ల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు మెస్‌లకు ఒకే చోట భోజనం తయారు చేస్తారు. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు ఈ విధంగా అయ్యింది. పలువురు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు క్యాంపస్‌లోనే ప్రాథమిక వైద్యం అందించారు. విద్యార్థుల సంఖ్య పెరగడం తో హాస్పటల్ కు తరలించారు.

ఇదిలా ఉంటే.. ఘటనపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని బాసర ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు ఆమె. ఫుడ్‌పాయిజన్‌పై పూర్తిస్థాయి విచారణ జరపుతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. మరోవైపు వైద్యశాఖ మంత్రి హరీష్‌రావు సైతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యాధికారుల్ని అడిగి తెలుసుకుంటున్నారు.