తిరుపతిలో మరోసారి భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరుపతి నగరాన్ని వరుణుడు వదిలిపెట్టడం లేదు. నాల్గు రోజుల క్రితం వరకు భారీ వర్షాలు పడిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ వరదల నుండి ప్రజలు బయట పడకముందే మరోసారి తిరుపతి నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షానికి పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రోడ్లు, కాలనీలు చెరువులు తలపిస్తున్నాయి. మొన్నటి వర్షాలకు శ్రీపద్మావతి యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలోకి వరద చేరింది. రైల్వే అండర్‌బ్రిడ్జిల వద్ద భారీగా నీరు చేరడంతో మూసేసి ట్రాఫిక్‌ మళ్లించారు. ముంపు కాలనీల్లో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి వస్తువులు నీటిలో పడవల్లా తేలియాడుతున్నాయి. తాగడానికి నీరు, తినడానికి తిండి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక ఇప్పుడు మరోసారి వర్షం పడుతుండడంతో నగరవాసులు వణికిపోతున్నారు.

రాయలసీమ వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంట, ఆస్తి, ప్రాణనష్టం తీవ్రంగా జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాలలోని పురాతన చెరువలను, మరమ్మత్తులు చేయకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ సరిగా చేపట్టకపోవడం వలన భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహించి చెరువు కట్టలు, సాగునీటి ప్రాజెక్టులు కూడా తెగిపోయాయని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణం నష్టం జరిగినా ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు పరిహారం, వరదలో ఆస్తి నష్టం జరిగిన ప్రతి కుటుంబానికి తక్షణ సహాయం కింద 50 వేల రూపాయాలు, గృహాల నిర్మాణానికి పూర్తిగా ఆర్థిక సహాయం, వర్షాలతో మరియు వరదలతో పంట నష్టానికి ఇన్ పుట్ సబ్సిడితో పాటు పంటల బీమా ద్వారా పూర్తి నష్ట పరిహారం, పశువుల నష్టానికి పూర్తి నష్ట పరిహారం, కోతకు గురైన భూముల పునరుద్ధరణకు ఆర్థిక సహాయం, పంట రుణాలను పూర్తిగా రద్దు చేసి నూతన పంట రుణాలు ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.