ఆదేశాలిచ్చినా కూల్చివేతలు ఆపరా?: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఈరోజు సుప్రీంకోర్టులో ఢిల్లీలోని జ‌హంగిర్‌పురిలో అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేత ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిగింది. షాపులు, ఇండ్ల కూల్చివేత‌ను నిలిపివేయాల‌ని తాము ఆదేశాలు ఇచ్చినా వాటిని ప‌ట్టించుకోకుండా ఎలా బుల్డోజ‌ర్ల‌కు ప‌ని పెట్టార‌ని ఇవాళ సుప్రీంకోర్టు త‌న తీర్పులో ప్ర‌శ్నించింది. ఆ అంశాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించ‌నున్న‌ట్లు సుప్రీం ధ‌ర్మాస‌నం తెలిపింది. జ‌స్టిస్ ఎల్ నాగేశ్వ‌ర రావు, బీఆర్ గ‌వాయిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ కేసును విచారించింది. ఎన్డీఎంసీ మేయ‌ర్‌కు కూల్చివేత ఆపేయాల‌ని ఆదేశాలు పంపినా, ఎలా నిర్మాణాల కూల్చివేత కొన‌సాగించార‌ని, ఈ అంశాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించి విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు సుప్రీం పేర్కొన్న‌ది.

కూల్చివేత‌కు ముందు నార్త్ ఢిల్లీ మున్సిపాలిటీ ఏదైనా నోటిసు ఇచ్చిందా లేదా అన్న అంశాన్ని స‌మ‌ర్పించాల‌ని కోర్టు కోరింది. అయితే ఈ కేసును మ‌ళ్లీ రెండు వారాల త‌ర్వాత విచారించ‌నున్న‌ట్లు చెప్పిన ధ‌ర్మాస‌నం.. ప్ర‌స్తుతం నిర్మాణాల కూల్చివేత‌పై స్టే కొన‌సాగించాల‌ని ఆదేశించింది. కూల్చివేత డ్రైవ్‌తో ఓ వ‌ర్గాన్ని టార్గెట్ చేశార‌ని సీనియ‌ర్ అడ్వ‌కేట్ దుశ్యంత్ దావే ఆరోపించారు. హ‌నుమాన్ జ‌యంతి రోజున రెండు వ‌ర్గాల మ‌ధ్య జ‌హంగిర్‌పురిలో ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న త‌ర్వాత అక‌స్మాత్తుగా అధికారులు ఆ ప్రాంతంలోని అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌ను ప్రారంభించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/