మంత్రి రోజా సెల్ ఫోన్‌ చోరీ… తిరిగి అప్ప‌గించిన పోలీసులు

తిరుప‌తిలోని ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్‌లో ఘ‌ట‌న‌

అమరావతి: మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తొలిసారి త‌న సొంత జిల్లాకు వెళ్లిన మంత్రి ఆర్కే రోజా బుధ‌వారం తిరుమ‌ల‌లో శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. గురువారం నాడు తిరుప‌తిలో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకున్న ఆమె మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెను స‌న్మానించేందుకు అధికారులు, వైసీపీ నేత‌లు పోటీ ప‌డ్డారు. ఫ‌లితంగా అక్క‌డ భారీ జ‌న సందోహం నెల‌కొంది. ఇదే అద‌నుగా ఓ వ్య‌క్తి రోజా మొబైల్ ఫోన్‌ను త‌స్క‌రించేశాడు.

త‌న సెల్ ఫోన్ క‌నిపించ‌క‌పోయే స‌రికి రోజా కంగారు ప‌డ్డారు. వెంట‌నే ప‌క్క‌నే ఉన్న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి మొబైల్ ఫోన్ చోరీకి గురైంద‌న్న ఫిర్యాదుతో పోలీసులు కూడా వెనువెంట‌నే రంగంలోకి దిగేశారు. అక్క‌డి సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించారు. అందులో రోజా మొబైల్‌ను చోరీ చేసిన వ్య‌క్తిని గుర్తించారు. రోజా సెల్ ఫోన్‌ను లాఘ‌వంగా త‌స్క‌రించేసిన స‌ద‌రు వ్య‌క్తి,.. ఫోన్‌తో కారు ఎక్కేసి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు.

కారు నెంబ‌రు ఆధారంగా పోలీసులు అత‌డి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్‌లో రోజా సెల్ ఫోన్‌ను కొట్టేసిన స‌ద‌రు వ్య‌క్తి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎస్వీ యూనివ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోకి వెళ్లిన‌ట్టుగా గుర్తించారు.వెంట‌నే అక్క‌డికి ప‌రుగులు పెట్టిన పోలీసులు ఎట్ట‌కేల‌కు దొంగ‌ను ప‌ట్టుకున్నారు. అత‌డి నుంచి రోజా సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచార‌ణ‌లో భాగంగా అత‌డు కాంట్రాక్టు ఉద్యోగి అని తేలింది. చోరీకి గురైన మంత్రి ఫోన్ దొర‌క‌డంతో దానిని జాగ్ర‌త్త‌గా తీసుకుని వ‌చ్చి రోజాకు అప్ప‌గించారు. మొబైల్ ఫోన్ చోరీ గురైన స‌మ‌యం నుంచి తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురైన రోజా… కాసేప‌టికే అది త‌న వ‌ద్ద‌కు చేరుకోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:  https://www.vaartha.com/telangana/