మరోసారి కొండగట్టులో దొంగలు హల్చల్

తెలంగాణ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు లో మరోసారి దొంగలు హల్చల్ చేసారు. రీసెంట్ గా దేవాలయంలో దొంగలు పడి సుమారు 15 కేజీల వెండి , బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగలను కర్ణాటకలోని బీదర్‌ ప్రాంతంలో పోలీసులు పట్టుకోగా..తాజాగా మరోసారి కొండగట్టులో దొంగలు తమ చేతివాటం చూపించారు. దర్శనం కోసం ఆలయానికి వచ్చిన భక్తులసెల్ ఫోన్లు, నగదును అపహరించారు. దీనిపై భక్తులు పోలీసులు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ లో రికార్డు అయిన వీడియో ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

గత నెల ఆలయంలో జరిగిన చోరీ కేసులో జగిత్యాల పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి అంజన్న వెండి విగ్రహం సహా మొత్తం 5 కిలోల వెండి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా కొండగట్టు ఆలయంలో చోరీకి పాల్పడినట్టుగా వెల్లడించారు. ఇలా తరుచు దొంగలు తమ చేతివాటం చూపిస్తుండడం తో భక్తులు భయంతో వణికి పోతున్నారు. ఆలయంలో సెక్యూరిటీ ని పెంచాలని కోరుతున్నారు.