ఏపీ సర్కార్ ఫై సుప్రీం కోర్ట్ ఆగ్రహం

కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు సాయం చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే నష్టపరిహారం అందజేయని విషయాన్ని పరిశీలించాలంటూ.. ఏపీ స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీకి సుప్రీం ఆదేశించింది. అలాగే ఏపీ తో పాటు బీహార్ ప్రభుత్వం ఫై కూడా సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను వర్చువల్‌గా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.యాభై వేల పరిహారం ఇస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. నిధులను కూడా కేటాయించింది. అయితే కొన్ని రాష్ట్రాలు చురుగ్గా కరోనా మృతుల కుటుంబాలను ఆదుకున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆదేశాలు.. దరఖాస్తులతోనే సరి పెట్టాయి. ఇంత వరకూ ఎవరికీ పరిహారం ఇవ్వలేదు. ఈ రాష్ట్రాల జాబితాలో ఏపీ , బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి.