మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు జగన్ శంకుస్థాప‌న‌

మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారని ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. సోమవారం అధికారులతో కలిసి భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన భూముల్లో మంత్రి అమర్ నాధ్ పర్యటించారు.

ట్రంపెట్ ర‌హ‌దారి నిర్మాణం జ‌రిగే ప్ర‌దేశాన్ని, ముఖ్య‌మంత్రి నిర్వ‌హించే భారీ బ‌హిరంగ స‌భ ప్ర‌దేశాల‌ను ఆయ‌న‌ ప‌రిశీలించారు. జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎంఎల్ఏ బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క‌రికాల వ‌లెవ‌న్‌, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో, అంత‌కుముందు స‌న్‌రే రీసార్ట్‌లో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను తెలుసుకున్నారు. శంకుస్థాపన, ముఖ్య‌మంత్రి స‌భ ఏర్పాట్ల‌పై అధికారులు, నాయ‌కుల‌తో చ‌ర్చించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ మే 3 భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. దాదాపు 2,200 ఎకరాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుందని చెప్పారు. శంకుస్థాపన చేసిన నాటి నుంచి పనులు ప్రారంభించి 24 నుంచి 30 నెలల్లో నిర్మాణం పనులు పూర్తి చేస్తామని తెలిపారు.