ఏపీ మూడు రాజధానుల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఏపీ మూడు రాజధానుల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చి న తీర్పుపై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్ లో కోరింది ఏపీ ప్రభుత్వం. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 23న కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. రాజధాని అంశంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలయింది.

శివరామకృష్ణ కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేలా చూడాలని ఆ కమిటీ సూచించింది. ఈ క్రమంలో మూడు రాజధానులపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణను చేపట్టనుంది. రెండు పిటిషన్లను కలిపి విచారించనుంది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ఏ విధంగా ఉండబోతోందనే విషయంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

2014లో ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారు. అయితే జగన్ సీఎం అయినా తర్వాత మూడు రాజధానుల అంశం తెరమీదికి తీసుకొచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా , కర్నూల్ ను న్యాయ రాజధానిగా , విశాఖపట్టణాన్ని పాలన రాజధానిగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని విపక్షాలు కోకోరుతున్నాయి. మరోపక్క అమరావతి రైతులు సైతం ఆందోళనలు నిర్వహించారు. పాదయాత్రలు, ధర్నాలు , ఆందోళనలు చేసారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి జేఏసీ, పలు పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. రాజధానిపై చట్టం చేసే అధికారం శాసభసభకు లేదని 2022 మార్చి మాసంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరి సుప్రీం కోర్ట్ ఏ తీర్పు ఇస్తుందో చూడాలి.