మార్గదర్శి చిట్ ఫండ్స్ పై సుప్రీం కీలక ఆదేశాలు

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

న్యూఢిల్లీః మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిపాజిట్ల వివరాలు బయటపెట్టాలని సుప్రీం ఆదేశించింది. మార్గదర్శిలో ఇన్వెస్ట్‌మెంట్‌ ఎంత? చెల్లింపులు ఎంత? అనే వివరాలు బయట పెట్టడంలో రహస్యం ఎందుకని ప్రశ్నించింది. ‘మార్గదర్శి’లో పెట్టుబడి పెట్టిన వారికి చేసిన చెల్లింపులకు సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. భారతీయ రిజర్వు బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించి మార్గదర్శి రూ. 2,600 కోట్ల డిపాజిట్లు సేకరించిందని, దీనిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జీబీ పార్దీవాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా మార్గదర్శి వాదనలపై సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. “ఒకవైపు హెచ్ యు ఎఫ్ అని మరోవైపు ప్రొపైటరీ కన్సర్న్ అంటూ చెప్పటాన్ని ప్రశ్నించింది. డిపాజిట్ల వివరాల్ని వెల్లడించాలని కోరింది. డిపాజిటర్ల అందరికి చెల్లింపులు చేసినట్లుగా మార్గదర్శి లాయర్ వెల్లడించారు.

దీనికి స్పందించిన సుప్రీంకోర్టు.. డిపాజిటర్లకు చెల్లింపులు చేసిన తర్వాత.. ఆ వివరాల్ని బయటపెట్టటంలో మీకున్న అభ్యంతరం ఏమిటంటూ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు మాజీ ఎంపీ కమ్ లాయర్ గా వ్యవహరిస్తున్న ఉండవల్లి వినిపించిన వాదనతో ఏకీభవిస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. తాజాగా సుప్రీం చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. సుదీర్ఘకాలంగా ఈ కేసు విషయంపై కోట్లాడుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇదో కీలక మలుపుగా అభివర్ణిస్తున్నారు. ఆయనేమన్నారంటే.. “మార్గదర్శిపై 17 ఏళ్ల న్యాయపోరాటంలో కీలక మలుపు ఇది.

మార్గదర్శిలో డిపాజిట్ల వివరాలు బయట పెట్టాలని సుప్రీం ఆదేశించింది. వాటి వివరాలు బయట పెట్టకుండా ఎందుకు దాస్తున్నారు? రూ.2600 కోట్ల డిపాజిట్లు ఎక్కడ నుంచి వచ్చాయి?డిపాజిట్లను ఎంత మందికి తిరిగి చెల్లించారు? చెక్కుల రూపంలో ఇచ్చారా..? మరో రూపంలో ఇచ్చారా? డిపాజిటర్ల వివరాలను కోర్టుకు అందజేయాలి. యాజమాన్య తీరును వివరించాలి అని సుప్రీం పేర్కొంది” అంటూ ఉండవల్లి పేర్కొన్నారు.