కుళ్లిపోతున్న శవాలు.. హడలెత్తుతున్న జనాలు!

కరోనా విలయతాండవానికి అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండగా, మరణాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. దీంతో ఏ ఆసుపత్రిలో చూసిన కరోనా రోగుల శవాలు గుట్టగుట్టలుగా కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా మీడియాలో తక్కువగా చూపిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది.

గుంటూరులోని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో శవాలు నిండిపోయాయి. అక్కడి మార్చురీలోని ఫ్రీజర్‌లో కేవలం నాలుగు శవాలను నిల్వ చేసే సామర్థ్యం మాత్రమే ఉంది. అయితే కరోనా కారణంగా మరణాల సంఖ్య భారీగా ఉండటంతో, ఆ మార్చురీకి వరుసగా శవాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో మార్చురీలో స్థలం లేకపోవడంతో, ఆరుబయటే శవాలను వదిలేస్తున్నారు అక్కడి సిబ్బంది. వాటిని పట్టించుకునే వారు లేకపోవడంతో అవి కుళ్లిపోయిన వాసన చుట్టుపక్కల ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది.

ఆసుపత్రికి వచ్చే రోగులు మార్చురీ బయట శవాలను చూసి భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇలా శవాలను ఎక్కడబడితే అక్కడ వదిలేయడంతో ఆసుపత్రి సిబ్బందిపై స్థానికులు మండిపడుతున్నారు. ఏదేమైనా మార్చురీ ఆరుబయట ఉన్న శవాలకు కనీస నిర్వహణ కూడా లేకపోవడంతో అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు.