‘వందే భారత్’పై మరో దాడి.. ఈసారి ఎక్కడంటే ..

‘వందే భారత్’ రైలు ఫై మరోసారి రాళ్ల దాడి జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్న ఈ రైలు..సంక్రాంతి నుండి తెలుగు రాష్ట్రాల్లోనూ పరుగులు పెడుతుంది. అయితే ఈ రైలు ఫై కొంతమంది వ్యక్తులు రాళ్ల దాడి చేయడం తో అందర్నీ భయాందోళనకు గురి చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టె ముందు వైజాగ్ సమీపంలో ముగ్గురు యువకులు రాళ్ల దాడి చేసిన ఘటన ఇంకా మరవకముందే..ఇప్పుడు బీహార్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

బీహార్‌లోని కతిహార్‌ జిల్లాలోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైలు నంబరు 22302పై కొందరు దుండగులు రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో సి6 బోగీ విండో అద్దాలు దెబ్బతిన్నాయి. అయితే, ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గతేడాది డిసెంబరు 30న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు రోజులకే రైలుపై రాళ్ల దాడి జరిగింది.