తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య రామాలయానికి ప్రత్యేక రైళ్లు

ఈ నెల 29 నుంచి వచ్చే నెల 28 వరకు అందుబాటులో ప్రత్యేక రైళ్లు

trains

హైదరాబాద్ః అయోధ్య రామమందిరాన్ని కనులారా వీక్షించాలనే భక్తులకు రైల్వే శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. సికింద్రాబాద్-అయోధ్య మధ్య నడిచే రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా ప్రయాణిస్తాయి. విజయవాడ నుంచి అయోధ్యకు వెళ్లే రైళ్లు ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్టణం, విజయవాడ, శ్రీకాకుళంరోడ్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయని రైల్వే తెలిపింది.

ప్రత్యేక రైళ్లు ఇలా..

సికింద్రాబాద్-అయోధ్య రైళ్లు ఈ నెల 29 నుంచి రోజువిడిచి రోజు బయలుదేరుతాయి. అంటే ఈ నెల 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరుతాయి.

కాజీపేట నుంచి అయోధ్యకు వెళ్లే రైళ్లు కూడా రోజువిడిచి రోజు బయలుదేరుతాయి. ఈ నెల 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరుతాయి.

విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, గుంటూరు నుంచి ఈ నెల 31న, రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి 7న, సామర్లకోట నుంచి వచ్చే నెల 11న అయోధ్యకు రైళ్లు బయలుదేరుతాయి. ఆయా స్టేషన్లలో బయలుదేరిన రైళ్లు తిరిగి అయోధ్య నుంచి అవే స్టేషన్లకు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.